తెలంగాణ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఓ అద్భుత దృశ్యానికి వేదికైంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతుల చేతుల మీదుగా స్వర్ణ విమాన గోపురం (Swarna Vimana Gopuram)మహాకుంభాభిషేకం అనంతరం శాస్త్రోక్తంగా ఆవిష్కరించబడింది. వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించగా, ఈ మహోత్సవం వైభవంగా సాగింది.
68 కిలోల బంగారంతో నిర్మించిన విశేషమైన గోపురం ఎత్తు 5.05 అడుగులు, వైశాల్యం 10,759 చదరపు అడుగులు ఉంటుంది. దీనిని రూ.8 కోట్లతో నిర్మించారు. 3.80 కోట్ల రూపాయల వ్యయంతో గోపురానికి స్వర్ణ తాపడం చేపట్టారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 23 వరకు జరుగనున్న నేపథ్యంలో, గోపుర ప్రతిష్టాపన పనులు వేగంగా పూర్తిచేశారు.
భక్తులకు కనువిందు చేసే శిల్పకళా వైభవం
స్వర్ణ విమాన గోపురంపై నృసింహ అవతారాలు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి (ఆండాళ్ అమ్మవారు), గరుడమూర్తి శిల్పాలు అత్యంత సుందరంగా రూపొందించబడ్డాయి. ఈ శిల్పకళా వైభవం భక్తులకు నిజమైన దివ్య అనుభూతినీ అందించనుంది. 8న స్వామి-అమ్మవార్ల కల్యాణోత్సవం, అలంకార, వాహన సేవలు భక్తులకు కనుల పండుగగా నిలవనున్నాయి.