ఏపీలో మంత్రుల అరాచకాలు రోజుకురోజుకూ పెరిగిపోతున్నాయనే ఆరోపణలను వరుసగా జరుగుతున్న సంఘటనలు నిజం చేస్తున్నాయి. రెండ్రోజులుగా మహిళా మంత్రి పీఏ లైంగిక వేధింపు ఘటన సంచలనంగా సృష్టిస్తుండగా, తాజాగా హోంమంత్రి అనిత తనను, తన కుటుంబాన్ని వేధిస్తోందని బాధిత మహిళ రోడ్డెక్కి ఆందోళన చేపట్టింది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనితపై ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేయడంతో రాజకీయ రంగంలో కలకలం రేగింది. “నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా భూమి ఇవ్వను. నా ప్రాణానికి, నా కుటుంబానికి హోంమంత్రి అనిత వల్ల ప్రమాదం ఉంది. నాకు ఏదైనా జరిగితే ఆమె బాధ్యురాలు” అని ఆ మహిళ రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భూమి ఇవ్వలేదని ల్యాబ్ సీజ్ చేశారా?
బాధితురాలి వివరాల ప్రకారం.. బల్క్ డ్రగ్ పార్క్ కోసం తమ భూమి ఇవ్వలేదన్న కారణంతోనే తనపై హోంమంత్రి అనిత కక్షసాధిస్తున్నారని ఆరోపణలు చేసింది. తునిలో ఉన్న తన ల్యాబ్‌ను సీజ్ చేసిన తర్వాత, పాయకరావుపేటలో ఉన్న మరో ల్యాబ్‌ను కూడా మూసివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. “పదవి చేతిలో ఉందని ఇలా ఇబ్బంది పెడతారా? ఓటేసిన ప్రజలకు మాట్లాడే హక్కు లేదా?” అంటూ ప్రశ్నించింది. “మనిషి బతకాలంటే రాజకీయ అండ ఉండేలా చేస్తున్నారు… ఇది న్యాయమా?” అని ఆమె ప్రశ్నించింది.
ప్రజల్లో అసంతృప్తి– డ్రగ్ పార్క్ పై నిరసనలు
నక్కపల్లి, రాజయ్యపేట ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. గతంలో హోంమంత్రి ఫ్లెక్సీని కూడా కొంతమంది చించివేయడం సంచలనం రేపింది. ఈ వివాదం ఇంకా చల్లారకముందే మహిళ ఆరోపణలు వెలుగులోకి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ మహిళకు న్యాయం చేయాలని, భయపెట్టడం, వేధించడం ఆపాలని ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారుల నుండి స్పష్టమైన వివరణ రావాల్సి ఉంది.
నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను
— Telugu Feed (@Telugufeedsite) November 28, 2025
నాకు, నా కుటుంబానికి హోంమంత్రి అనిత వల్ల ప్రాణహాని ఉంది
నా ప్రాణం పోతే ఆవిడదే బాధ్యత..
కక్షపూరితంగా తన ల్యాబ్‌ను సీజ్ చేశారని రోడ్డుపై బైఠాయించి మహిళ ఆవేదన
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఘటన
పదవి… pic.twitter.com/8JGW6UyPVD








