భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇటీవల టెస్టు క్రికెట్ (Test Cricket)కు వీడ్కోలు (Farewell) పలికి అభిమానులను నిరాశపరిచాడు. 36 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉన్న కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, ప్రస్తుతం టీమిండియా పరిస్థితులు చూస్తుంటే కోహ్లీ తిరిగి టెస్టుల్లోకి రావాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
కోహ్లీ అవసరం: సీనియర్ల మార్గదర్శకత్వం
లార్డ్స్ టెస్ట్ ఓటమి తర్వాత శుభ్‌మన్ గిల్ (Shubman Gill) వంటి యువ ఆటగాళ్లకు సీనియర్ల మార్గదర్శకత్వం ఎంత అవసరమో స్పష్టమైంది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడటంలో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. కోహ్లీ లాంటి సీనియర్ ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్ మదన్ లాల్ (Madan Lal) వంటి సీనియర్లు, “రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గడంలో తప్పు లేదు. ఈ సిరీస్‌లో కాకపోయినా తదుపరి సిరీస్‌లోనైనా కోహ్లీ తిరిగి రావాలి. అతని పునరాగమనం టీమిండియాకు పెద్ద బూస్ట్‌ను ఇస్తుంది” అని అంటున్నారు.
జకోవిచ్, ధోనీ ప్రస్తావన
టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ 38 ఏళ్ల వయసులోనూ అద్భుతంగా రాణిస్తున్నప్పుడు, 36 ఏళ్ల కోహ్లీ ఫిట్‌గా ఉండి టెస్టుల నుంచి రిటైర్ కావడంపై చర్చ మొదలైంది. క్రికెట్ కంటే టెన్నిస్‌లో ఒత్తిడి ఎక్కువైనప్పటికీ జకోవిచ్ ఆడగా, కోహ్లీ ఎందుకు ఆడకూడదు అనే వాదన వినిపిస్తోంది. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ 43 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్‌లో ఆడుతుండటంతో, 36 ఏళ్ల కోహ్లీ దేశం కోసం టెస్టుల్లోకి తిరిగి వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోహ్లీ మనసు మార్చుకుంటాడా?
అన్ని కోణాల్లో చూసినా టీమిండియాకు కోహ్లీ అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఒలింపిక్స్ కోసం అవసరమైతే టీ20 రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటా అన్న కోహ్లీ, దేశం కోసం టెస్టుల్లోకి వస్తానంటే ఆనందించనిదెవరు? ఇక్కడ జరగాల్సిందల్లా కోహ్లీ తన మనసు మార్చుకోవడమే. ప్రిన్స్ (గిల్)తో కలిసి కింగ్‌లా జట్టును ముందుకు నడిపిస్తాడా అనేది వేచి చూడాలి.