విశాఖపట్టణంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు క్రికెట్ స్టేడియం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు.
ఈ నిరసనలను అడ్డుకోవడానికి పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ ఆగ్రహం
టీడీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో వైఎస్సార్ గుర్తులను తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీచ్ రోడ్‌లోని వైఎస్సార్ వ్యూ పాయింట్ల తొలగింపు, స్టేడియం పేరును మార్పు చేయడం, మరమ్మతుల పేరిట వైఎస్సార్ పేరును చెరిపివేయడం వంటి చర్యలతో వైఎస్సార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ స్టేడియానికి వైఎస్సార్ పేరు తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబడుతూ, వైఎస్సార్ సేవలను తక్కువ చేయడం ప్రజలు సహించరని హెచ్చరిస్తున్నారు.








