గ్యాస్ కొరత.. విశాఖలో హోటల్ రంగం సంక్షోభం!

గ్యాస్ కొరత.. విశాఖలో హోటల్ రంగం సంక్షోభం!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం (War Situation) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ముడి చమురు (Crude Oil), గ్యాస్ (Gas) సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అనేక దేశాల్లో అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావం భారత్‌లో(India) కూడా కనిపిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ (LPG Gas) సరఫరాలో ఏర్పడిన సమస్యలు పలు రంగాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పర్యాటక నగరమైన విశాఖపట్నంలో (Visakhapatnam) హోటల్(Hotel) రంగం ఈ సంక్షోభంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హోటల్స్ అసోసియేషన్ (Hotels Association) ప్రకారం దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో విశాఖపట్నంలో కూడా హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడే పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల (Commercial LPG Cylinders) కొరత తీవ్రంగా ఉందని యజమానులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు సుమారు రూ.1300 ఉన్న ఒక కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1700 దాటిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.3000 వరకు పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

విశాఖపట్నంలో చిన్నా పెద్దా కలిపి దాదాపు 1000 హోటళ్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా సుమారు 65 వేల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం కేవలం 45 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 12 నుంచి 14 వేల సిలిండర్లను మాత్రమే అందించగలమని గ్యాస్ ఏజెన్సీలు తెలిపినట్టు సమాచారం. ముందుగా రోజుకు మూడు షిఫ్టులుగా సరఫరా జరిగేదని, ఇప్పుడు మాత్రం మూడు రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ అందుతున్నట్టు హోటల్ యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే హోటళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment