విశాఖ‌ డ్రగ్స్ కేసులో కీలక మ‌లుపు.. ఆ రెండు పబ్‌లు ఎవ‌రివి..?

డ్రగ్స్ కేసులో కీలక మ‌లుపు.. ఆ రెండు పబ్‌లపై అనుమానాలు

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న‌ విశాఖపట్నం (Visakhapatnam) కొకైన్ కేసు (Cocaine Case) రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అక్షయ్ కుమార్‌ (Akshay Kumar)తో పాటు సౌత్ ఆఫ్రికా (South Africa)కు చెందిన థామస్‌ (Thomas) డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య వర్మ (Sri Krishna Chaitanya Varma)ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, కేసు వెనుక ఉన్న కింగ్‌పిన్‌ను పట్టుకునేందుకు ఢిల్లీలో స్పెషల్ టీమ్ వేట కొనసాగిస్తోంది. అయితే, విశాఖలోని లోకల్ పోలీస్ టీమ్ ఈ దిశగా ఎటువంటి పురోగతి సాధించలేకపోతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సంచ‌ల‌నం రేపుతున్న ఈ కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ గుర్తించిన రెండు పబ్‌ (Two Pubs)లలో సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటివరకు పరిశీలించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ పబ్‌లపై విచారణను కూటమి నాయకులు అడ్డుకుంటున్నారని, వారి అండదండలతో ఈ పబ్‌లు నడుస్తున్నాయని స్థానికంగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న ఈ పబ్‌లలో కూటమి నాయకుల కుమారుల ప్రమేయం ఉందనే చర్చ ఊపందుకుంది. ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ కేసులోని కీల‌క నిందితుల‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, ఈ దిశ‌గానే ఓ ఎమ్మెల్యే సీపీ ఆఫీస్‌లో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా బ‌హిరంగ చర్చ జ‌రుగుతోంది.

అక్షయ్, థామస్ కాల్ రికార్డుల ఆధారంగా మరో ముగ్గురిని విచారణ కోసం తీసుకున్నప్పటికీ, రాజకీయ ఒత్తిడితో 24 గంటల్లో ఇద్దరిని విడుదల చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత అమర్‌నాథ్ ఆరోపించారు. ఈ కేసు విశాఖ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది. అయితే డ్ర‌గ్స్ కేసులో నిస్ప‌క్ష‌పాత విచార‌ణ చేయాల‌ని, నిందితులు ఎంత‌టివారైనా బ‌య‌ట‌పెట్టాల‌ని విశాఖలోని విద్యార్థి, ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న‌ డ్ర‌గ్స్ కేసులో రాజకీయ జోక్యం జరిగిందని, అందుకే రిమాండ్ రిపోర్ట్‌ను బయటకు రాకుండా కొంద‌రు బ‌డా నేత‌లు అడ్డుకున్నారని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక విశాఖ‌ నగరం డ్రగ్స్ హబ్‌గా మారిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. గ‌త ఐదు రోజులుగా డ్ర‌గ్స్ కేసులో కీల‌క విష‌యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నా.. పోలీసుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక స్పంద‌న రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment