ఉచిత బస్సు పథకం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తోటి ఆటోడ్రైవర్ల సమస్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న నిరసన చేపట్టాడు. విశాఖకు చెందిన ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీనివాస్ విశాఖపట్నం నుంచి అమరావతి వరకు పాదయాత్ర ప్రారంభించారు. “ఫ్రీ బస్ పథకం వల్ల లక్షలాది ఆటో డ్రైవర్ కుటుంబాలు కష్టాల్లోకి నెట్టబడ్డారు. పూట గడవక ఆటో డ్రైవర్లు బిక్కుబిక్కి మంటున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు నిరసనలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు ఉచిత బస్సు పథకం ప్రారంభించే రోజు, ఆటో డ్రైవర్లకు కూడా శుభవార్త చెబుతానని ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా వైసీపీ ప్రభుత్వం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించిందని వారు గుర్తుచేసుకుంటున్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏ విధమైన ప్రత్యామ్నాయ పథకం ప్రకటించకపోవడం పట్ల మండిపడుతున్నారు. ఇక, “ప్రభుత్వమే ఆటోలు లీజుకు తీసుకుని, నెలకు రూ.25 వేలు జీతం ఇవ్వాలి” అని డిమాండ్ చేస్తున్న ఆటో డ్రైవర్ల వీడియోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.