ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ వారు ఆందోళన చేస్తుండడం పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించగా, మరిన్ని తొలగింపుల కోసం యాజమాన్యం సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
నేటితో యాజమాన్యం నిర్ధేశించిన గడువు ముగియనుండటంతో కార్మికుల్లో ఆందోళన తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో రిజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మరోసారి చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చలు విఫలమైతే, బుధవారం నుంచి కార్మికులు సమ్మె బాట పడే అవకాశం ఉంది. కార్మికుల భవిష్యత్తు ఏమవుతుందో ఇంకా స్పష్టత రాకపోవడంతో, ఈ పరిణామాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి.








