టీమిండియా (Team India) సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు వెళ్ళాడు. సుమారు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగుతుండటంతో అభిమానులు కింగ్ కోహ్లీ ఆట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఆస్ట్రేలియాకు చేరుకున్న కొద్ది గంటల్లోనే కోహ్లీ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, “నువ్వు వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడే, నువ్వు నిజంగా ఓడిపోతావు” (‘You only truly lose when you decide to quit’) అంటూ విరాట్ కోహ్లీ చేసిన ఆసక్తికరమైన మెసేజ్ తన వన్డే భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారి తీసింది.
2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యల అసలు అర్థం ఏమిటని అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇది తన ఫామ్ లేదా కెరీర్ పట్ల వస్తున్న విమర్శలకు కౌంటరా? లేక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా సమాధానమా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా, ఈ కీలకమైన సిరీస్‌లో కోహ్లీ రాణించకపోతే, జట్టులో అతని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉండటంతో, ఆయన పోస్ట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.








