విజయవాడ (Vijayawada)లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కట్టుకున్న భార్య (Wife)పై కత్తి (Knife)తో దాడి చేసి అతి కిరాతకంగా పొడిచాడో భర్త. అందరూ చూస్తుండగా జరిగిన ఈ దారుణ ఘటన విజయవాడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రక్త తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సరస్వతిని ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని విన్స్ ఆసుపత్రి (Vinn’s Hospital)లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న సరస్వతి (Saraswathi), భవానీపురంలోని శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న విజయ్(Vijay) 2022 ఫిబ్రవరి 14న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంపతుల మధ్య గత కొన్ని నెలలుగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. కుటుంబ కలహాలు తీవ్రతరం కావడంతో, సరస్వతి తన రెండేళ్ల కుమారుడితో వేరుగా నివసిస్తున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో సరస్వతి ప్రవర్తనపై విజయ్‌కు అనుమానం పెరిగి, ఆ అనుమానం పిచ్చిగా మారింది. మంగళవారం ఉదయం సరస్వతి డ్యూటీకి వెళ్తుండగా, విజయ్ ఆమెను నడిరోడ్డుపైనే ఆపి కత్తితో పలు సార్లు పొడిచాడు. రక్తపు మడుగులో సరస్వతి కుప్పకూలి పోయింది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరంలో ఈ ఘటన సంచలనం రేపింది.








