ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’లను జూన్ 12 నుంచి పంపిణీ చేయనుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ కిట్‌లను అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది, జూన్ 20లోపు పంపిణీ పూర్తి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కిట్‌లలో యూనిఫాం, బెల్ట్, నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్‌లు, డిక్షనరీ వంటి అవసరమైన వస్తువులు ఉంటాయి. ఒక్కో కిట్‌కు రూ.2,279 ఖర్చవుతుందని, ఈ పథకం ద్వారా విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మండలాలకు కిట్‌లను సరఫరా చేశారు.
ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో అమలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌బుక్స్, యూనిఫామ్స్‌తో సహా తొమ్మిది రకాల వస్తువులను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తెచ్చిన పథకాన్ని కొనసాగిస్తూ జగనన్న విద్యా కానుక పేరును ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్’గా పేరు మార్చింది.
‘విద్యార్థి మిత్ర కిట్’ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కిట్‌లు విద్యార్థులకు అవసరమైన అన్ని ఉపకరణాలను అందించడం ద్వారా వారి విద్యా ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాక, తల్లిదండ్రుల ఆర్థిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం విద్యా రంగంలో సమాన అవకాశాలను కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.