టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత కక్షసాధింపుల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు నమోదయ్యాయని, అందుకు ఎంపీ లెటర్ హెడ్ మీద తనపై చేసిన ఫిర్యాదు కాపీనే సాక్ష్యమని మాజీ మంత్రి విడుదల రజిని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కుమారుడే ఎస్పీ కావడంతో తనపై జరుపుతున్న విచారణ అంతా శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్‌లోనే సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తనపై రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చివరికి ఒక కట్టుకథను తయారు చేసి ఏసీబీ కేసు నమోదు చేయించారన్నారు విడదల రజిని.
తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని గతంలో ఎక్కడా కలవలేదు, మాట్లాడలేదని, ఎలాంటి లావాదేవీలు తమ మధ్య జరగలేదన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంబంధించిన అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటానని టీడీపీ ఎంపీ హామీ ఇచ్చి తప్పుడు కేసు పెట్టించారన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2020, సెప్టెంబర్ 2న గురజాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్, డీఎస్పీలకు డబ్బు ఇచ్చి తనది, తన కుటుంబ సభ్యులు, తన ఆఫీస్ స్టాఫ్ కాల్ డేటాను ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు తెప్పించుకున్నాడని, కాల్ డేటా కోసం తప్పుడు ఫిర్యాదులతో కేసు పెట్టించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడని విడదల రజిని సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ విషయాన్ని వైసీపీ అధ్యక్షుడు, నాటి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకురాగానే ఆయన వాస్తవాలు తెలుసుకుని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులను మందలించారన్నారు. పోలీస్ శాఖ కూడా చట్టపరిధిని అతిక్రమించిన సీఐ, డీఎస్సీలపై శాఖపరంగా విచారించి సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. అప్పటి నుంచి తనపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడని, ఒకేపార్టీలో ఉండటం వల్ల ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటపెట్టలేదని కీలక విషయాలను వెల్లడించారు.
ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావులు కలిసి చివరికి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, జర్మనీలో ఉంటున్న తన మరిదిని, వృద్దుడైన మామని కూడా వదలకుండా తప్పుడు కేసులు నమోదు చేయించారని మండిపడ్డారు. బాధపెట్టి తన కళ్లల్లో కన్నీళ్లు చూడాలని వారి తాపత్రయం, కోరిక ఎప్పటికీ నెరవేరదన్నారు. తనను భయపెట్టలేరన్నారు. శ్రీకృష్ణదేవరాయులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కారుచౌకగా భూములను కాజేస్తున్నారని, గతంలో విశాఖలోనూ ఇలాగే భూదందా చేశారని చెప్పారు. ప్రస్తుతం చెరువు భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు.