టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం AK47’ (Aadarsha Kutumbam AK47) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ మళ్లీ వెంకటేష్‌తో పని చేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించిన తాజా కాస్టింగ్ అప్డేట్ ఇప్పుడు ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం టాలెంటెడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj)ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో చర్చలు పూర్తి చేసి, గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, నివేదా పాత్ర మాత్రం కథలో కీలక మలుపు తీసుకువచ్చేలా ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె క్యారెక్టర్లో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ‘అల వైకుంఠపురములో’లో చిన్న పాత్రలో కనిపించిన నివేదా.. ఈసారి త్రివిక్రమ్ సినిమాలో మరింత పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం.







