వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట లభించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించగా, వాదనలు విన్న న్యాయస్థానం అరెస్ట్‌పై తాత్కాలిక స్టే విధించింది.
కేసు ఏంటంటే.. 2024 జూలై 7న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడలోని వల్లభనేని వంశీ నివాసంపై టీడీపీ నాయకులు కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో వంశీ ఇంటిపై దాడి చేసిన వారే ఇప్పుడు రివర్స్‌లో తప్పుడు ఫిర్యాదు చేసి, వంశీపై కేసు నమోదు చేయించారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.
2024లో జరిగిన ఆ ఘటనపై ఇటీవల మాచవరం పోలీస్ స్టేషన్‌లో సునీల్ అనే వ్యక్తి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, దూషించి, దాడి చేశారని, దాంతో తాము గాయపడ్డామని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వల్లభనేని వంశీతో పాటు మొత్తం 20 మంది పై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారం రాజకీయంగా మరో కొత్త వివాదానికి దారి తీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆయన వర్గాలు అభివర్ణిస్తున్నాయి. తాజా కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో వల్లభనేని వంశీకి తాత్కాలిక ఊరట లభించింది. అరెస్ట్ చేయవద్దన్న ఆదేశాలు జారీ కావడంతో, ప్రస్తుతం వంశీకి చట్టపరమైన రక్షణ లభించింది.








