కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చాక వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)పై అనేక కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీపై కేసుల నమోదు పరంపర కొనసాగుతూనే ఉంది. 2024 జూలై 7న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, విజయవాడలోని వంశీ నివాసంపై టీడీపీ(TDP) నాయకులు కత్తులు, కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇంటిపై దాడి చేసిన వారే తాజాగా రివర్స్‌లో తప్పుడు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారని వంశీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 2024లో జరిగిన ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్లో (Machavaram Police Station) తాజాగా సునీల్ అనే వ్యక్తి వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.
తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, దూషించి, దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తమపై దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వల్లభనేని వంశీతో పాటు మొత్తం 20 మంది పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త వివాదానికి దారి తీస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంశీపై అనేక కేసులు నమోదు చేయించి, దాదాపు 137 రోజుల పాటు జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.








