ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడి సేవించడం వెనుక గొప్ప శాస్త్రీయ, ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయి. ఆరు రుచుల కలయికతో చేసే ఈ పచ్చడిని ‘షడ్రుచుల సమ్మేళనం’ అని పిలుస్తారు. జీవితం అంటే కేవలం సుఖం మాత్రమే కాదు.. కష్టసుఖాలు, తీపి చేదులు అన్నీ కలిస్తేనే జీవితం అని చెప్పడమే ఈ పచ్చడి ముఖ్య ఉద్దేశం. ఈ పచ్చడిలోని ఆరు రుచులు మానవ జీవితంలోని ఆరు భావోద్వేగాలకు ప్రతీకలుగా పెద్దలు చెబుతారు.
పచ్చడిలో ఉపయోగించే బెల్లం జీవితంలో ఆనందం లాంటిది. అలాగే చేదు (వేపపువ్వు)- కష్టాలు, చింతపండు – తెలివైన ఆలోచనలు, ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచి, వగరు (మామిడి ముక్కలు) – కొత్త సవాళ్లు, అనుభవాలు, కారం – కోపం, ఆవేశం. వీటన్నింటినీ సమానంగా స్వీకరించినప్పుడే జీవితం పరిపూర్ణమౌతుందని ఈ పచ్చడి గుర్తు చేస్తుంది. వసంత కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టే శక్తి ఈ పచ్చడికి ఉంది. వేపపువ్వు యాంటీ సెప్టిక్‌గా, బెల్లం శక్తినిచ్చేదిగా, చింతపండు జీర్ణక్రియకు మేలు చేసేదిగా పనిచేస్తాయి.
ఉగాది పచ్చడి పదార్థాలు
కొత్త చింతపండు, కొత్త బెల్లం, లేత వేపపువ్వు, పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి లేదా పచ్చిమిర్చి, కొన్ని ప్రాంతాల్లో అరటిపండు ముక్కలు, వేయించిన శనగపప్పు కూడా వేస్తారు.
- తయారీ క్రమం
- ముందుగా చింతపండును నీళ్లలో నానబెట్టి, చిక్కటి రసం తీసుకోవాలి.
- ఆ రసంలో తరిగిన బెల్లాన్ని వేసి బాగా కరిగించాలి.
- అందులో చిన్నగా తరిగిన పచ్చి మామిడి ముక్కలను వేయాలి.
- శుభ్రం చేసిన వేపపువ్వును (రెమ్మలు తీసేసి కేవలం పూలనే) కలపాలి.
- చివరగా తగినంత ఉప్పు, కారం (మిరియాల పొడి) వేసి బాగా కలపాలి.
- వీలైతే అరటిపండు చక్రాలు లేదా కొబ్బరి ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత, ఖాళీ కడుపుతో ఈ ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యం కూడా లభిస్తుందని మన పెద్దల నమ్మకం. ఈ ఏడాది మీ జీవితంలో కూడా ఈ ఆరు రుచులు సమపాళ్లలో ఉండి, మీకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.








