తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ర్యాలీకి ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట జరిగి 40 మంది మృతిచెందారు. ఈ ఘటనలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండగా, మృతిచెందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తొక్కిసలాట ఘటనపై కరూర్ జిల్లా కలెక్టర్‌తో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడారు. తక్షణ సహాయ చర్యలకు ఆదేశించారు. టీవీకే ర్యాలీకి విజయ్ 10 వేల మందితో అనుమతి తీసుకున్నప్పటికీ, ఊహించని రీతిలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగినట్లుగా ప్రాథమిక అంచనా.
తమిళనాడు తొక్కిసలాటలో 40 మంది మృతిచెందడంపై ప్రధాని మోడీ సహా, ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.







