తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని కరూర్ (Karur)లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషాద ఘట్టంగా నిలిచింది. గత నెల 27న దళపతి విజయ్ (Thalapathy Vijay) నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విజయ్ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు
విజయ్ పార్టీ తమిళగ వెట్టి కజగం (TVK) ఆధ్వర్యంలో అక్టోబర్ 27న మహాబలిపురం (Mahabalipuram)లో బాధిత కుటుంబాలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇందుకోసం ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో 50 గదులు బుక్ చేసినట్లు సమాచారం. కరూర్ నుంచి బాధిత కుటుంబాలు మహాబలిపురం చేరేందుకు పార్టీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయ్ స్వయంగా ప్రతి కుటుంబాన్ని కలసి సంతాపం తెలియజేయనున్నారు.
గత నెలలో జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ (M.K.Stalin) రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి టీవీకే పార్టీకి చెందిన ఇద్దరు సహాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు రేకెత్తిస్తోంది.





 



