గోవింద నామస్మరణతో మార్మోగే శ్రీవారి కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడి బూతుపురాణం భక్తులను తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. బోర్డు సభ్యుడిగా భక్తిభావాన్ని పెంచాల్సిన వ్యక్తి.. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద తన అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. ఆయన తీరుతో సమీపంలోని శ్రీవారి భక్తులంతా ముక్కున వేలేసుకున్నారు.
తిరుమల తిరుపతి బోర్డు సభ్యుడిగా ఉన్న నరేశ్ మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో మహాద్వారం గేటు తెరవాలని అక్కడున్న ఉద్యోగికి సూచించాడు. దీంతో టీటీడీ ఉద్యోగి ఆ గేట్ నుంచి బయటకు పంపడం లేదని ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశాడు.
‘ఏమనుకుంటున్నావ్? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు?’ అని టీటీడీ ఉద్యోగిని బోర్డు మెంబర్ నరేశ్ అసభ్యకరంగా దూషించారు. దీంతో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా రౌడీలా వ్యవహరించడంపై భక్తులు మండిపడుతున్నారు.