స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Institutions Elections) బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల జీవో అమలు, ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు (High Court) ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించాలని ప్రభుత్వం నిశ్చయించింది.
హైకోర్టు స్టే ఎత్తివేసి, ఎన్నికల నిర్వహణకు అనుమతి కోరుతూ సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నందున హైకోర్టు జోక్యం సరికాదని, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే 57.6% బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించామని ప్రభుత్వం బలంగా వాదించనుంది. ఈ మేరకు సీనియర్ కౌన్సిల్‌తో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మరోవైపు, రిజర్వేషన్ల జీవో 9ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీ. మాధవరెడ్డి సహా ఇతరులు సుప్రీంకోర్టులో కేవియట్ (Caveat) దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లిన పక్షంలో, తమ వాదన వినకుండా ఎలాంటి ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వరాదని వారు కోర్టును అభ్యర్థించారు. ఈ పరిణామంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది.







