హెచ్-1బీ (H-1B) వీసాదారుల (Visa Holders) వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయం ఐటీ కంపెనీలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ (Microsoft) తమ విదేశీ ఉద్యోగులకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
వివిధ దేశాలలో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు సెప్టెంబర్ 21లోగా తిరిగి అమెరికాకు రావాలని కంపెనీ సూచించింది. మైక్రోసాఫ్ట్ అంతర్గత ఈ-మెయిల్ ద్వారా ఈ సమాచారాన్ని పంపినట్లు ‘రాయిటర్స్’ (Reuters) కథనాలు తెలిపాయి. ట్రంప్ నిర్ణయంతో ఐటీ కంపెనీలపై పెను భారం పడనుండటంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అక్కడే కొనసాగాలని కూడా మైక్రోసాఫ్ట్ సూచించింది.
ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు తమ విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టుల కోసం హెచ్-1బీ వీసాలను ఉపయోగిస్తాయి. కొత్త నిబంధన ప్రకారం, కంపెనీలు ఇకపై ప్రతి వీసాకు ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా కంపెనీలే ఈ వీసా ఛార్జీలను భరిస్తాయి. దీంతో, ఈ నిర్ణయం ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.








