గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్ను.. ప్రతి వ్యక్తికి లక్ష డాలర్లు?

గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్ను.. ప్రతి వ్యక్తికి లక్ష డాలర్లు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కన్ను డెన్మార్క్‌కు చెందిన ద్వీపం గ్రీన్‌ల్యాండ్ (Greenland) పై పడింది. తమ జాతీయ భద్రతకు గ్రీన్‌ల్యాండ్ అత్యంత కీలకమని ట్రంప్ వ్యాఖ్యానిస్తూ, అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై యూరప్ దేశాలు (European Countries) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్‌ల్యాండ్ ఉత్తర అమెరికా మరియు యూరప్ మధ్య ఉన్న భౌగోళిక స్థానం కారణంగా, ముఖ్యంగా ఆర్కిటిక్ భద్రత, క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు మరియు సైనిక నిఘా పరంగా నాటోకు మరియు అమెరికాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా ఉంది. డెన్మార్క్ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో సభ్యదేశం కావడంతో, దానిపై దాడి జరిగితే నాటో భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందని యూరప్ దేశాలు హెచ్చరిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఎలాగైనా గ్రీన్‌ల్యాండ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలనే దిశగా ట్రంప్ పరిపాలన కీలక వ్యూహాలు రచిస్తోంది. గ్రీన్‌ల్యాండ్ ప్రజలకు నేరుగా నగదు ఇవ్వాలనే ప్రణాళికను కూడా పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. గ్రీన్‌ల్యాండ్‌లో నివసించే ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు చెల్లించాలనే అంశంపై అమెరికా అధికారులు చర్చలు జరిపినట్టు సమాచారం. దీని ద్వారా డెన్మార్క్ నుంచి సెమీ-ఆటానమస్ ప్రాంతంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను వేరుచేయాలని అమెరికా భావిస్తోంది.

మరోవైపు, డెన్మార్క్ కూడా అమెరికాకు ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడి జరిగితే ఆదేశాల కోసం ఎదురుచూడకుండా సైన్యం కాల్పులు ప్రారంభిస్తుందని స్పష్టం చేసింది. గ్రీన్‌ల్యాండ్ ప్రజల్లో మెజారిటీ కూడా “గ్రీన్‌ల్యాండ్ అమ్మకానికి లేదు” అంటూ అమెరికా ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. కేవలం 57 వేల మంది జనాభా ఉన్న ఈ ద్వీపం సహజవనరులు, వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగి ఉండటంతో ట్రంప్ ప్రభుత్వం డబ్బుతో పాటు ఫ్రీ అసోసియేషన్ ఒప్పందం (COFA) మార్గాన్నీ పరిశీలిస్తోంది. అయితే, ఈ ఒప్పందం అమలవ్వాలంటే ముందు గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ నుంచి విడిపోవాల్సి ఉండటంతో, ప్రజలను ఆర్థికంగా ఆకర్షించాలనే ప్రయత్నాల్లో అమెరికా నిమగ్నమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment