జార్జియాలోని గూడౌరిలోని ప్రసిద్ధి చెందిన స్కై రిసార్ట్ ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో 12 మంది మృతిచెందగా అందులో 11 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటనలో, గూడౌరిలోని భారతీయ రెస్టారెంట్ అయిన హవేలీలో పని చేస్తున్న సిబ్బందిగా ఉన్న వీరు, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడం వల్ల మరణించారు అనేది అధికారుల ప్రాథమిక సమాచారం.
ఎంబసీ స్పందన
ఈ ఘటనపై భారత ఎంబసీ కార్యాలయం స్పందిస్తూ “మా దృష్టికి 11 భారతీయులు మరణించినట్లు సమాచారం వచ్చిందని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామని” ప్రకటించింది. మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
పోలీసుల విచారణ
జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి దాడి జరిగినట్లు గుర్తించబడలేదు. మృతులు కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.