తిరువూరు టీడీపీలో మరోసారి ఇసుక అక్రమ రవాణా వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) అనుచరులు ఆంధ్రా – తెలంగాణ సరిహద్దు గ్రామమైన పెద్దవరం వద్ద అక్రమంగా ఇసుకను డంప్ చేసి, ఆ ఇసుకను తెలంగాణకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ అనే ఎంపీ అనుచరులు ఇసుకను పగలూ రాత్రీ తేడా లేకుండా తరలిస్తున్నారని తెలుస్తోంది. తమ వెనుక మాదాల హరిచరణ్ కిట్టు ఉన్నాడంటూ స్థానికులను బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. పెద్దవరంలో గ్రామస్తులతో కలిసి ఇసుక డంపింగ్ స్థలాలను పరిశీలించి, పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు దగ్గరుండి సెటిల్మెంట్లు చేస్తున్నారని, అందుకే తెలంగాణ-ఏపీ బార్డర్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టలేదని ఏసీపీతో ఫోన్‌లో వాగ్వాదం జరిపారు. పోలీసుల సహకారంతోనే గంజాయి బ్యాచ్‌కు చెందిన వారే ఇసుక అక్రమ రవాణాలో పాలుపంచుకుంటున్నారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణ చేశారు.
ఇంతకీ, ఒకే వ్యక్తి పేరుతో పదుల సంఖ్యలో ఇసుక బుకింగ్‌లు జరగడం, గంజాయి ముఠాలు, పోలీసుల ప్రమేయం వంటి అంశాలన్నీ కలిసీ ఈ వ్యవహారాన్ని మరింత సంచలనంగా మారుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలతో తిరువూరు టీడీపీలో ఇసుక మాఫియా మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఎంపీ వర్గానికి చెందిన వారే ఇసుకదందా చేస్తున్నారని ఎమ్మెల్యే బయటపెట్టడం సంచలనంగా మారింది. అదే విధంగా గంజాయి అమ్ముతున్నారని పోలీసులపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే.. ఇసుక దందా కూడా పోలీసుల కనుసన్నల్లో జరుగుతుందని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.