టీటీడీ (TTD) ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu)పై వైసీపీ సీనియర్ నేత, టీటీడీ(TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీటీడీ వ్యవస్థ భ్రష్టుపట్టిందని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 60 మంది గాయపడిన ఘటనపై అప్పట్లో క్షమాపణ చెప్పకపోవడానికి బీఆర్ నాయుడు అహంకారమే కారణమని మండిపడ్డారు. సాక్షి కార్యాలయాల (Sakshi Offices)పై దాడులు జరిపించిన గూండాలను పట్టించుకోని ప్రభుత్వం, మరోవైపు మీడియా స్వేచ్ఛను అణచివేయడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని ఆయన హెచ్చరించారు.
బంట్రోతుతో మొదలై లక్షల కోట్లకు అధిపతి ఎలా?
బీహెచ్ఈఎల్‌లో బంట్రోతు ఉద్యోగం చేసే బి.ఆర్.నాయుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బంట్రోతు ఉద్యోడం తరువాత రెడీమేడ్ దుస్తుల దుకాణం తెరిచాడని, ట్రావెల్ ఏజెంట్ అవతారం ఎత్తి టికెట్లపై ధరలు నియంత్రణ లేని రోజుల్లో రూ.3 వేల టికెట్‌కు రూ.10 వేలకు పైగా వసూళ్లు చేశాడని, ఫారిన్ ఎక్చేంజ్ ద్వారా మోసాలకు పాల్పడ్డాడని, పెనుగొండ కాళేశ్వరం బాబా ఆస్తులు కొట్టేశాడని భూమన వివరించారు. 38 ఏళ్లకే కాళేశ్వర బాబా ఎలా చనిపోయాడు విచారణ జరపాలని, ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న బీఆర్ నాయుడు లక్షల కోట్ల రూపాయలకు ఎలా అధిపతి అయ్యాడు..? టీవీ5 చానెల్ ఎలా పెట్టాడని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.
వీటిపై ఎంక్వైరీ ఏదీ..?
చైర్మన్ బి.ఆర్. నాయుడు అక్రమాలపై వరుస ఆరోపణలు చేస్తూ భూమన కరుణాకరరెడ్డి విరుచుకుపడ్డారు. బెల్ట్‌షాపులు, గోశాలలో అవకతవకలు, విదేశీ కరెన్సీ మోసాలు, టికెట్ల విక్రయంలో అవినీతితో పాటు కొండపై అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. వీటిపై విచారణ ఎక్కడ..? పాప వినాశనంలో బోట్ల షికార్లపై ఎంక్వైరీ ఏదీ..? అని ప్రశ్నించారు. అదేవిధంగా మూడవ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, శ్రీవాణి రద్దు, VIP టికెట్ల కేటాయింపులపై ప్రస్తుత టీటీడీ బోర్డు అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.
టీవీ5పై రూ.10 కోట్ల పరువునష్టం దావా
సాక్షి చానెల్ మాత్రమే ప్రజాస్వామ్య గొంతుకగా నిలుస్తోందని, మిగతా చానెల్స్ టీటీడీలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చే పనిలో ఉన్నాయని భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. టీవీ5 చానెల్ ద్వారా వైసీపీ నేతల వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి రూ.10 కోట్ల పరువు నష్టం కేసు వేస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నాలు విఫలమవుతాయని, తిరుమల పవిత్రతను కాపాడటంలో తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.








