తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల సందర్భంగా తిరుమల కొండపై భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది.
ఈ సమయంలో టోకెన్ లేని భక్తులు సర్వ దర్శనం కోసం దాదాపు 20 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. అయితే, శనివారం అర్ధరాత్రి వరకు 78,414 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
హుండీలో భారీ కానుకలు..
భక్తులు హుండీలో రూ. 3.45 కోట్లు కానుకలు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల సమయం పడుతుండగా, క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి టీటీడీ ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులకు, సుమారు 5 గంటల్లో స్వామి వారి దర్శనం లభిస్తోంది.







