ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కూర్చునే స్థానం విషయంలో జరిగిన వివాదం కాస్తా దాడికి దారితీసింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి చేరుకున్నారు. అయితే కూర్చునే విషయంలో వారు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి, చివరకు పరస్పరం దాడికి దిగారు.
ఈ ఘటనలో ఓ భక్తుడు గాజు సీసాతో మరో భక్తుడి తలపై కొట్టడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న మరొకరికి కూడా గాయాలయ్యాయి వెంటనే బాధితులను తిరుమల అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం, అతనికి ప్రాణాపాయం లేదని, తలకు గాయమై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో మిగతా భక్తులు ఆందోళనకు గురయ్యారు. శాంతియుత వాతావరణం ఉండాల్సిన తిరుమలలో ఇటువంటి సంఘటనలు జరగడం తగదని భక్తులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.