దళపతి విజయ్‌కు బిగ్ షాక్.. ‘జన నాయగన్’ సీన్లు లీక్‌

దళపతి విజయ్‌కు బిగ్ షాక్.. 'జన నాయగన్' సీన్లు లీక్‌

తమిళ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. రాజకీయంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయనకు, తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలికే చివరి చిత్రం ‘జన నాయగన్’ విషయంలో ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన కీలక సీన్లు
సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఇంకా క్లియరెన్స్ కూడా రాని ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 5 నిమిషాల నిడివి గల సీన్లు, అలాగే ఒక పాట ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు షూటింగ్ స్పాట్ లేదా ఎడిటింగ్ టేబుల్ నుంచి వీటిని సేకరించి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రిలీజ్‌కు బ్రేక్.. అడుగడుగునా ఆటంకాలు
నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే ఈ ప్రాజెక్టుకు మొదటి నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. సినిమాలోని కొన్ని డైలాగులు, రాజకీయ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇతర సాంకేతిక, న్యాయపరమైన కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే కంటెంట్ బయటకు రావడంతో చిత్ర నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ అభిమానుల్లో టెన్షన్
రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడానికి ముందు విజయ్ న‌టించిన‌ ఆఖరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవైపు పార్టీని ఎన్నిక‌ల్లో గెలిపించ‌డం కోసం క‌ష్ట‌ప‌డుతున్న విజ‌య్‌కి, మరోవైపు తన సినిమాకు ఇలాంటి సమస్యలు రావడం ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అసలే రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న విజయ్‌కు, ఈ సినిమా లీకేజీ వ్యవహారం ‘గోరుచుట్టుపై రోకలిపోటు’లా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment