తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం..

తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం..

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న చుట్టే తెలంగాణ రాజ‌కీయం తిరుగుతోంది. గ‌త రెండ్రోజులుగా ఇదే హాట్ టాపిక్‌. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ ఘ‌ట‌న‌పై, హీరో అల్లు అర్జున్‌పై కామెంట్స్ చేసిన త‌రువాత అధికార కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా అల్లు అర్జున్‌ను తీరును, ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. కొంద‌రైతే అల్లు అర్జున్ సీఎంకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మ‌రికొంద‌రు బ‌న్నీ ఇంటిపై దాడి చేసి విధ్వంస‌క‌ర ఘ‌ట‌న‌ను క్రియేట్ చేసి అరెస్టు పాల‌య్యారు. ఇదే కేసులో స‌స్పెన్ష‌న్‌కు గురైన ఏసీపీ అల్లు అర్జున్‌ను ఉద్దేశిస్తే తోలు జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిక‌లు సైతం జారీ చేశారు.

పుష్ప‌-2 సినిమా ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేట‌ర్‌కు చేరుకున్న స‌మ‌యంలో క్రౌడ్ విప‌రీతంగా రావ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగి రేవ‌తి అనే అభిమాని మృతిచెంద‌గా, ఆమె కుమార్ శ్రీ‌తేజ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు పోలీసులు. స‌మాచారం అందుకున్న బ‌న్నీ ఆ కుటుంబానికి సానుభూతి చెబుతూ రూ.25 ల‌క్ష‌ల ప‌రిహారం, శ్రీ‌తేజ్ ఆస్ప‌త్రి ఖ‌ర్చుతో పాటు ఆ కుటుంబానికి అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చి జ‌రిగిన ఘ‌ట‌న‌పై ప‌శ్చాతాపం వ్యక్తప‌రిచారు.

ఆ త‌రువాత బ‌న్నీని అరెస్టు చేయ‌డం, బెయిల్‌పై విడుద‌ల‌వ్వ‌డం ఇవ‌న్నీ వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. అయితే ఈ కేసు గురించి సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్ర‌స్తావించారు. జైలు నుంచి విడుద‌లైన అల్లు అర్జున్‌కు కాలు పోయిందా, క‌న్ను పోయిందా.. ఎందుకు ఆయ‌న‌కు ప‌రామ‌ర్శ‌లు అంటూ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. సీఎం మాట్లాడిన అనంత‌రం అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి జ‌రిగిన ఘ‌ట‌నను వివ‌రిస్తూ త‌న ఇమేజ్‌ను దెబ్బ‌తీసేందుకు కుట్ర జ‌రుగుతున్న‌ట్లుగా ఆరోపించారు.

బ‌న్నీ ప్రెస్‌మీట్‌ను త‌ప్పుబ‌డుతూ మంత్రి స్థాయి నుంచి కార్య‌క‌ర్త స్థాయి వ‌ర‌కు అంద‌రూ అల్లు అర్జున్‌ను క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఓయూ జేఏసీ నేత‌లు కొంద‌రు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు, ట‌మాటాల‌తో దాడి చేసి ఇంట్లోని కుండీల‌ను ధ్వంసం చేశారు. ఆ స‌మ‌యంలో బ‌న్నీ ఇంట్లో లేక‌పోవ‌డంతో ఆయ‌న మామ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి పిల్ల‌లిద్ద‌ర్నీ వారి భ‌ద్ర‌త దృష్ట్యా త‌న ఇంటికి తీసుకెళ్లాడు.

అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్న‌ట్లు సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ, సీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించం.. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అల్లు అర్జున్ గురించి సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారని, డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. ఒక లక్ష పై చిలుకు పోలీసుల కుటుంబాలు ఉన్నాయి. ఒక్క బందోబస్తు చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి.. అప్పటికప్పుడు బందోబస్తు కావాలంటే కుదరదని విష్ణుమూర్తి పేర్కొన్నారు. ఒక్క పోలీసు అధికారి కూడా నీ దగ్గరకి రాకుండా చేస్తాం.. ఎలా బయటకి వెళ్తావో ఆలోచించుకో బ‌న్నీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఘ‌ట‌నే హాట్ టాపిక్‌గా మారింది. ఏ న‌లుగురు క‌లిసినా దీని గురించే చ‌ర్చ‌. ఇంకా ఎన్ని రోజులు ఇదిలా కొన‌సాగుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment