తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనదైన మార్క్ పరిపాలనతో ముందుకు సాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా మారుస్తూ తన ముద్ర వేసుకునేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. మార్పు కోవలోకి మరొక అంశం వచ్చి చేరింది. ప్రభుత్వం తాజాగా పోలీస్ లోగోలో మార్పులు చేసింది, ఈ మార్పులు ఆసక్తికరంగా మారాయి. ఈ మేరకు కొత్త లోగోను TG పోలీస్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసింది.
కొత్త లోగోలో ప్రధాన మార్పులు
గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా, ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్పు చేసింది. ప్రధానంగా స్టేట్ అనే పదాన్ని తొలగించడం ద్వారా కొత్త లోగోను తేలికగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మార్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వ విధానంలో స్థిరత్వం కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత TS స్థానంలో TGగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ గీతం మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసిన ప్రభుత్వం.. తాజాగా పోలీస్ శాఖ లోగో మార్పులు చేపట్టింది.








