తెలంగాణలో (Telangana) గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat Elections) పోరు నేటితో ముగియనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తవగా, నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు (Vote Counting) ప్రారంభం కానుండగా, సాయంత్రానికి అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల్లో ముమ్మర ఏర్పాట్లు చేయడంతో పాటు, మొత్తం 43,856 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోగా, 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు గ్రామ పంచాయతీల ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించడంతో, నేడు 3,752 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 12,652 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు, 140 మంది ఇతరులు ఓటు హక్కును వినియోగించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, సమస్యాత్మక కేంద్రాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.








