సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పాశమైలారం (Pashamylaram)లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద (Fire Accident) ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) (HRC) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై జులై 30లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్, ఫైర్ డీజీ, సంగారెడ్డి ఎస్పీలకు హెచ్‌ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఫిర్యాదు, విచారణ డిమాండ్
ఈ ఘటనపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి (Dundra Kumaraswamy) హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పాతబడిన మిషనరీ వాడటం, అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి కోరారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఇండిపెండెంట్ కమిటీ వేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ (Sigachi Chemical Factory)లలో నాణ్యతా ప్రమాణాలపై నివేదిక ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కూడా ఆయన హెచ్‌ఆర్సీని అభ్యర్థించారు. ఈ సుమోటో స్వీకరణతో ఈ ప్రమాద ఘటనపై లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది.