తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పంపిన రిజర్వేషన్ల బిల్లులను (Reservation Bills కేంద్రం ఆమోదించకుండా ఆలస్యం చేస్తోందని ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. విద్య, ఉపాధి అంశాలతో పాటు, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులను కేంద్రం ఆమోదించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు ఢిల్లీ (Delhi)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “మాకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు.. మతాలు ప్రాతిపదిక కావు. వెనుకబాటుతనమే తమ ప్రాతిపదిక” అని ఆయన స్పష్టం చేశారు. రేపు (గురువారం) ఉదయం మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లను కలుస్తామని, సర్వే వివరాలను వారికి వివరిస్తామని తెలిపారు. తమ తరఫున పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారిని కోరతామని చెప్పారు.
రేపు సర్వే కోసం జరిగిన ప్రక్రియపై కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జనగణనలో కుల గణనను చేర్చాలని, జనగణనలో కులగణన ఎలా చేయొచ్చు, ఈ విషయంలో దేశానికి తెలంగాణ ఎలా మోడల్‌గా నిలిచిందో వివరిస్తామన్నారు. తాము చేసిన సర్వే దేశానికి రోల్ మోడల్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తమ కార్యాచరణ సిద్ధం చేశామని, కేంద్రం రిజర్వేషన్లను తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కూటమి నేతలను కూడా కలుస్తామని పేర్కొన్నారు.
బీజేపీపై రేవంత్‌రెడ్డి విమర్శలు
సోషల్ జస్టిస్‌కు అందరూ సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. “గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ ముస్లిం రిజర్వేషన్లు తొలగించి బీజేపీ నేతలు తెలంగాణ గురించి మాట్లాడాలి. బీజేపీ నేతలు వితండ వాదం చేస్తున్నారు” అని మండిపడ్డారు.
ఒక ఇంటర్వ్యూలో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని అమిత్ షా అన్నారని గుర్తు చేస్తూ, “ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా..?” అని ప్రశ్నించారు. కేంద్రం తక్షణమే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
“సర్వేను శాసన సభలో ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చాం. వ్యక్తుల వ్యక్తిగత వివరాలను బహిరంగపరచలేదు. 3.9 శాతం ప్రజలు తమకు ఏ కులం లేదని డిక్లేర్ చేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను రోడ్డుపై పెట్టలేం. ఫస్ట్ క్యాబినెట్ ముందు పెట్టాలి. శాసన సభలో ప్రశ్నిస్తే.. సమాధానం చెప్తాం. అడిగిన వివరాలు ఇస్తాం. పబ్లిక్ డొమైన్లో పెట్టేటప్పుడు.. అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తాం. క్యాబినెట్లో చర్చించి, శాసన సభలో ప్రవేశ పెడతాం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. మతాలు ప్రాతిపదిక కాదు. వెనుకబాటుతనమే మా ప్రాతిపదిక. బీజేపీ తొండి వాదన చేస్తోంది. తమ దగ్గర రీసెర్చ్ అండ్ అనాలసిస్ వివరాలు ఉన్నాయి. కేంద్రం బిల్లును ఆమోదించకపోతే, ఒత్తిడి తెచ్చేందుకు మా వ్యూహం మాకుంది” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.







