టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన నోటి దురుసుతో ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. బీజేపీ మహిళా నేతలు యామిని, సినీ నటి మాధవీలతపై అసభ్యకరంగా మాట్లాడాడు. జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నటి మాధవీలత సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో ఎట్టకేలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి దిగివచ్చారు.
సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆవేశంలో మాట్లాడటం తప్పే, కించపరచాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 72 సంవత్సరాల వయసున్న నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడాను తప్పితే, ఆమెను కించపరచాలనే ఉద్దేశం లేదని క్షమాపణలు కోరారు.
తాడిపత్రిలో మహిళల కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన ఈవెంటపై మాధవీలత సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. దానిపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. “మాధవీలత ఒక వ్యభిచారి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిగా, మాధవీలత జేసీపై తీవ్రంగా స్పందించారు.
ఈ వివాదంపై మంత్రి సత్యకుమార్, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు స్పందించారు. బీజేపీ నేతలు సైతం జేసీ తీరును తప్పుబట్టారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి దిగివచ్చి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు.