ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరువాత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ ప్రయాణంపై వివిధ రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తరపున శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా నియమించబడిన తమ్మినేనికి ఇటీవల తన నియోజకవర్గమైన ఆముదాలవలసకి కొత్త ఇన్‌చార్జిని నియమించడం పట్ల అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో, తమ్మినేని కుటుంబం జనసేన పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తలపై తమ్మినేని ఘాటుగా స్పందించారు.
జనసేనలో చేరాల్సిన అవసరమేంటి?
తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల నా కుమారుడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. 15 రోజులుగా ఆస్పత్రి వద్దే ఉన్నాను. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. కానీ, ఈ విషయాన్ని కొందరు అసత్య కథనాలుగా మార్చారు. నాకు జనసేనలో చేరాల్సిన అవసరమేంటి? అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ప్రజల నుంచి వస్తున్న విమర్శలపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అవసరం లేదు” అని తమ్మినేని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు.