తమిళనాడులో త్రిభాషా విధానంపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. డీఎంకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం హిందీని మూడో భాషగా తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం కోరుతోంది. అయితే, ఈ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికే పలు సందర్భాల్లో హిందీని బలవంతంగా రుద్దవద్దని స్పష్టం చేశారు. NEP అనేది విద్యా విధానం కాదని, అది కాషాయ విధానమని ఆయన ఆరోపించారు.
రూపాయి గుర్తు మార్పు
తాజాగా, తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌లో హిందీ భాషలో ఉండే రూపాయి చిహ్నాన్ని (₹) తొలగించి, దాని స్థానంలో తమిళ భాషలో రూపాయి గుర్తును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వం మరియు తమిళనాడు ప్రభుత్వ మధ్య త్రిభాషా విధానంపై వివాదం మరింత ముదిరింది.
అయితే, ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూపాయి గుర్తును మార్చడానికి తమిళనాడు ప్రభుత్వానికి హక్కులులేవని, ఆ రాష్ట్రంలో ప్రత్యేక కరెన్సీ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విధమైన చర్యలు భవిష్యత్తులో తమిళనాడుకు ఆర్థిక నష్టం కలిగించవచ్చని, కంపెనీలు ఇతర రాష్ట్రాలకు మారిపోవచ్చు అని హెచ్చరిస్తున్నారు. త్రిభాషా విధానంపై తమిళనాడు చేస్తున్న ఈ ఉద్యమం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాలి.