తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ 18 ఏళ్ల చెస్ అద్భుత యువ క్రీడాకారుడు డి. గుకేశ్‌ను ఘనంగా సత్కరించారు. గుకేశ్ ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించి, అత్యంత పిన్న వయస్సులో చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ విజయాన్నిఅందుకున్న గుకేశ్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ. 5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.
గుకేశ్ సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి, 14 గేమ్‌ల పోటీలో 7.5-6.5 తేడాతో విజయం సాధించారు. చెన్నైకి చెందిన గుకేశ్ ఈ విజయంతో ప్రపంచ స్థాయిలో భారత చెస్ ప్రతిష్ఠను మరింత పెంచారు.
తమిళనాడు గర్వపడుతున్న రోజు
గుకేశ్ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. “18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలవడం గర్వకారణం. మీ ఈ విజయంతో చెన్నై ప్రపంచ చెస్ రాజధానిగా మరింత బలపడింది. తమిళనాడు మిమ్మల్ని చూసి గర్విస్తోంది” అని ట్వీట్ చేశారు.