సురుచీ సింగ్ హ్యాట్రిక్ గోల్డ్!

సురుచీ సింగ్ హ్యాట్రిక్ గోల్డ్!

భారత యువ షూటర్ సురుచీ సింగ్ మరోసారి తన అద్భుత ప్రతిభను నిరూపించుకుంది. జర్మనీలోని మ్యూనిచ్‌లో శుక్రవారం జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆమె స్వర్ణ పతకం సాధించి, ఇది ఆమెకు వరుసగా మూడో ప్రపంచకప్ విజయం కావడం విశేషం. 19 ఏళ్ల సురుచీ ఈ ఉత్కంఠభరిత ఫైనల్లో 241.9 స్కోరు సాధించి, ఫ్రాన్స్‌కు చెందిన ఒలింపిక్ రజత పతక విజేత కామిల్ జెడ్రెజెవ్స్కీ (241.7)పై కేవలం 0.2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. చైనాకు చెందిన యావో క్యాన్‌షుయాన్ (221.7) కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

“లేటెస్ట్ గోల్డెన్ గర్ల్”గా సురుచీ
ఈ విజయంతో సురుచీ సింగ్ భారత షూటింగ్‌లో “లేటెస్ట్ గోల్డెన్ గర్ల్”గా నిలిచింది. ఈ ఏడాది బ్యూనస్ ఐరీస్, లిమా వేదికలపై కూడా సురుచీ వరుసగా స్వర్ణ పతకాలు గెలుచుకుంది. బ్యూనస్ ఐరీస్ టోర్నమెంట్‌నే ఆమె తన మొదటి అంతర్జాతీయ అరంగేట్రంగా చేసుకుంది. ఈ ఫైనల్లో ఆమెకు ఎదురైన పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, తన సహనంతో, నిబద్ధతతో ఆమె విజయం సాధించింది. ఫైనల్లో ఆమె చేసిన షాట్లు, ముఖ్యంగా చివరి నిమిషాల్లో ఆమె జోరు పెంచిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. చివరి రెండు షాట్లలో సురుచీ, కామిల్‌తో హోరాహోరీగా పోటీపడి, తన చివరి బుల్లెట్‌తో గెలుపును ఖాయం చేసుకుంది.

మ్యాచ్ సాగిందిలా..
ఈ గోల్డ్ మెడల్ భారత షూటింగ్‌కు ఈ ప్రపంచకప్‌లో తొలి స్వర్ణంగా నిలిచింది. ఈ విజయంతో సురుచీ సింగ్ భవిష్యత్తులో భారత షూటింగ్‌కు అగ్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించగలదనే నమ్మకాన్ని ఇచ్చింది. ఫైనల్ తొలి సిరీస్‌లో 52.1 స్కోరు చేసిన సురుచీ మంచి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ రెండో సిరీస్‌ తర్వాత ఆమె స్థానం కొంత దిగజారింది.

11వ షూట్‌లో వచ్చిన 9.7 స్కోరు ఆమెను నాలుగో స్థానానికి తీసుకెళ్లింది. అయితే వెంటనే 12వ షూట్‌లో ఆమె కొట్టిన అద్భుతమైన 10.8 స్కోరు ఆమెకు మళ్లీ ఆధిక్యం తెచ్చిపెట్టింది. 18వ షూట్ తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన కామిల్ ముందంజలోకి వచ్చింది. చివరి రెండు షాట్స్‌కు ముందు సురుచీ 0.5 పాయింట్ల తేడాతో వెనుకబడినా, 23వ షూట్‌లో ఆమె చేసిన 10.5 స్కోరు విజయం దిశగా దోహదపడింది. చివరి షాట్‌లో ఇద్దరూ 9 స్కోర్లు సాధించినా, సురుచీ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

క్వాలిఫికేషన్ రౌండ్‌లోనూ అదుర్స్!
ఈ ఫైనల్‌కు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో సురుచీ 588 పాయింట్లు సాధించి, మను భాకర్ స్థాపించిన జాతీయ రికార్డును సమం చేసింది. అయితే యావో 589 పాయింట్లతో జూనియర్ వరల్డ్ రికార్డ్ సృష్టిస్తూ టాప్ స్కోరర్‌గా నిలిచింది. మను భాకర్ 574 పాయింట్లతో 21వ స్థానం దక్కించుకోగా, పాలక్ 570 స్కోరుతో 30వ స్థానంలో నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment