ఆర్థిక నేరారోపణలతో తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ లేఖలో రూ.7,640 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుకేశ్ చంద్రశేఖర్ ప్రకటించాడు.
సుకేశ్ తన విదేశీ వ్యాపారాల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.22,410 కోట్లు ఆదాయం పొందినట్లు పేర్కొన్నాడు. ఈ ఆదాయానికి సంబంధించిన రూ.7,640 కోట్ల పన్నును చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. నెవెడాలోని ఎల్ఎస్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ మరియు బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్‌లో రిజిస్టర్ చేసిన స్పీడ్ గేమింగ్ కార్పొరేషన్ వంటి కంపెనీలను 2016 నుంచి నిర్వహిస్తున్నట్లు వివరించాడు. అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం తన ఆదాయం చట్టబద్ధమేనని లేఖలో పేర్కొన్నాడు.
సుకేశ్‌పై కేసులు..
సుకేశ్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతో పాటు వందల మందిని మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల్లో అతని భార్య లీనా మారియా పాల్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.