తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాల ఏర్పాటుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ నాయకులను కీర్తించడానికి ప్రజా నిధులను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నిస్తూ, న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. తగిన ఉపశమనం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సూచించింది.
హైకోర్టు ఉత్తర్వులకు మద్దతు
తిరునల్వేలి జిల్లాలోని వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రజా ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతిని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఇలాంటి విగ్రహాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని హైకోర్టు గతంలో పేర్కొంది. సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.
కరుణానిధి రాజకీయ ప్రస్థానం
కరుణానిధి తమిళనాడు రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. దశాబ్దాల పాటు డీఎంకే పార్టీని నడిపారు, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018 ఆగస్టు 7న కరుణానిధి మరణించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 40 లోక్‌సభ స్థానాల్లో యూపీఏను గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2026 ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.







