ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షం అమరావతి ప్రాంతంలో ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. బుధవారం సాయంత్రం అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. తుళ్లూరులోని మేరీ మాత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ సమీపంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ విద్యార్థి తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ద్రోణి ప్రభావంతో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం అస్థిరంగా మారింది. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. విజయవాడ నగరం సహా పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న 3 గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు సూచనలు
వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని కోరింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.







