అన్నమయ్య (Annamayya) జిల్లా రాయచోటి (Rayachoti) పరిధిలో జరిగిన హృదయ విదారక ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. లక్కిరెడ్డిపల్లి (Lakkireddipalli) మండలం కలాడివాండ్లపల్లికి చెందిన అమరనాధరెడ్డి (Amaranadha Reddy) తన కుమారుడు శేషాద్రి రెడ్డి (Sheshadri Reddy)ని ఉన్నతంగా చదివించాలని, భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాల క్రితం బి.కోత్తకోట సమీపంలోని రిషి వాటిక (Rishi Vatika) గురుకులంలో చేర్పించాడు.
అయితే, గత నెలలో స్కూల్ ఫీజు (School Fees) చెల్లించలేదని ఆక్షేపించిన గురుకులంలోని భోదనేతర సిబ్బంది వెంకటేష్ (Venkatesh) అనే వ్యక్తి, బాలుడిపై దారుణంగా దాడి చేశాడు. శేషాద్రి రెడ్డి స్నేహితులతో కలిసి ఆటలాడుతున్న సమయంలో రాయితో కొట్టడంతో అతని కంటికి తీవ్రమైన గాయం తగిలింది. రక్తస్రావం జరుగుతున్నప్పటికీ గురుకుల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కుటుంబం ఆరోపిస్తోంది.
కంటి దెబ్బ తీవ్రత పెరగడంతో తండ్రి అమరనాధరెడ్డి తన కుమారుడిని తిరుపతిలోని అరవింద కంటి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శేషాద్రి రెడ్డి ఒక కంటికి చూపు శాశ్వతంగా కోల్పోయాడని నిర్ధారించారు. బాధిత కుటుంబం వెంటనే కోత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అమరనాధరెడ్డి మాట్లాడుతూ.. “నా కొడుకును చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలని ఆశించాను. కానీ స్కూల్ ఫీజు పేరుతో అతని కంటికి చూపే పోయింది. జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం నిందితులను కాపాడే పనిలో పడ్డారు. మాకు న్యాయం కావాలి” అని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యా సంస్థల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.