పోలీస్ స్టేషన్ (Police Station) ఎదుటే వ్యక్తి దారుణ హత్య(Brutal Murder)కు గురైన ఘటన శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathya Sai District)లో కలకలం రేపుతోంది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగిందన్న విమర్శలు వ్యక్తం అవుతుండడం సంచలనంగా మారింది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పోలీస్ స్టేషన్ ఎదుటే ఈశ్వరప్ప (Eshwarappa) (25) అనే వ్యక్తిని దుండగులు వేట కోడవలి, కత్తులతో నరికి చంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈశ్వరప్ప అనే వ్యక్తి ఓ వివాహితను తీసుకెళ్లాడు. దీనిపై మహిళ భర్త హరి ఫిర్యాదు చేయడంతో తనకల్లు పోలీసులు నెల్లూరు జిల్లా గూడూరు వెళ్లి ఈశ్వరప్పతో పాటు మహిళను అదుపులోకి తీసుకుని తనకల్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే ఈశ్వరప్పను తరలించే సమయంలో పోలీసు స్టేషన్ ఎదుటే ఈశ్వరప్ప దారుణ హత్యకు గురికావడం తీవ్ర దుమారం రేగింది. నిందితులు దాడి చేస్తుంటే పోలీసులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారని సమాచారం.
పోలీస్ జీప్ నుంచి దిగిన వెంటనే మహిళ భర్త హరి, అతడి బంధువులు ఈశ్వరప్పపై కత్తులతో దాడి చేసి హత్య చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో తనకల్లు ఎస్సై గోపిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కదిరి నియోజకవర్గం తనకల్లు పోలీసుల పనితీరుపై సర్వత్రా చర్చ జరుగుతుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.








