కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ‘క్యాబ్’ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) గంగూలీ ఏకగ్రీవంగా ఈ పదవిని చేపట్టారు. 2015-2019 మధ్య ఇదే పదవిలో పనిచేసిన గంగూలీ, ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ బాధ్యతలు స్వీకరించడం విశేషం. 2019 నుంచి 2022 వరకు ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
అభివృద్ధి ప్రణాళికలు:
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ, ఈడెన్ గార్డెన్స్‌ను ఆధునీకరించి దాని సామర్థ్యాన్ని లక్షకు పెంచడంతో పాటు, ప్రతిష్టాత్మక మ్యాచ్‌లను నిర్వహించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే టెస్టుకు ఈడెన్ ఆతిథ్యం ఇవ్వనుంది.
వచ్చే టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో కోల్‌కతాకు కీలక మ్యాచ్‌లు దక్కేలా బీసీసీఐతో మాట్లాడి ప్రయత్నం చేస్తానని చెప్పారు. బెంగాల్ రంజీ జట్టును మరింత బలోపేతం చేయడమే తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. “క్రికెట్ తర్వాతే మిగతా అంశాలు వస్తాయి” అని ఆయన అన్నారు. 9 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ఆధునిక క్రికెట్ అకాడమీని నిర్మించనున్నట్లు, దాని కోసం భూమిని ఇప్పటికే సేకరించి ప్లానింగ్ పూర్తి చేసినట్లు గంగూలీ వెల్లడించారు.







