కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి (Sir Ganga Ram Hospital) నుంచి సోమవారం తెల్లవారు జామున డిశ్చార్జ్ అయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్‌తో పాటు వెన్నుముకకు సంబంధించిన సమస్యల కారణంగా గత వారం, జనవరి 5న ఆమె ఆసుపత్రిలో చేరారు.
వైద్యుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి అవసరమైన మందులు, ఫిజియోథెరపీ చికిత్స అందించారు. ఈ చికిత్సలతో ఆమె ఆరోగ్యం మెరుగుపడగా, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇంకా పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని సూచిస్తూ, ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సలహా ఇచ్చారు.
సోనియా గాంధీ త్వరగా కోలుకోవడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని, త్వరలోనే ప్రజాజీవితంలో చురుగ్గా పాల్గొనాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.








