ఉత్తరాంధ్ర (Uttarandhra)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం (Simhachalam) అప్పన్న ఆలయం (Appanna Temple)లో ఉద్యోగులు వారి చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆలయ హుండీ (Hundi) లెక్కింపులో ఉద్యోగుల దొంగతనం వెలుగులోకి వచ్చింది. హుండీలో నుంచి రూ.55,500 దొంగిలించినట్లు ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో ఒకరు పర్మినెంట్ ఉద్యోగి కాండ్రేగుల రమణ కాగా, మరొకరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్.
కాగా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ 98వ వార్డు టీడీపీ(TDP) అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్ (Panchadarla Srinivas) సోదరుడు కావడం విశేషం. ఈ ఘటనపై ఆలయ పరిపాలన విభాగ ఏఈవో రమణమూర్తి గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సింహాచలం అప్పన్న ఆలయ ఈవో త్రినాదరావు స్పందించి పర్మినెంట్ ఉద్యోగి రమణను వెంటనే సస్పెండ్ చేశారు. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అధికార తెలుగుదేశం పార్టీ నేత సోదరుడు కావడంతో అధికారులు అతని తొలగింపుపై వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








