కొన్నాళ్లుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూటమి పార్టీల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బయటపడింది. తెలుగుదేశం పార్టీ అంటేనే జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీపై తీవ్ర కోపంతో రగిలిపోతున్నారు. అందుకు తాజా సంఘటనే నిదర్శనం.
తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కూటమి పార్టీల అభ్యర్థిగా టీడీపీకి చెందిన రాజశేఖర్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని రాజోలుకు చెందిన జనసేన నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌కు జనసేన కార్యకర్తలు సపోర్టు చేయొద్దంటూ ఆ పార్టీ క్రియాశీలక నేత యెనుముల వెంకటపతి రాజు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. పార్టీ మీద బతికే నాయకులు వస్తే ఛీకొట్టండి అంటూ వెంకటపతి రాజు పెట్టిన పోస్టులు వైరల్‌గా మరాయి. జనసేన కార్యకర్తలను రోడ్డున పడేస్తే, నాయకులను కూడా రోడ్డున పడేస్తామని జనసేన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిపక్ష వైసీపీ బహిష్కరించగా, అధికార పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గెలుపు తమదేనని టీడీపీ ధీమాగా ఉన్నప్పటికీ వాలంటీర్ల రూపంలో అభ్యర్థులకు సవాళ్లు ఎదురయ్యాయి. అధికార పార్టీ అభ్యర్థులకు పోటీగా వాలంటీర్లు నామినేషన్లు వేశారు. తమకు ఉపాధి లేకుండా చేసిన టీడీపీని ఓడిస్తామని బహిరంగంగా ప్రకటించారు. వాలంటీర్ల వ్యతిరేకతతో సతమతమవుతున్న అభ్యర్థులకు జనసేన పార్టీ నేతల మద్దతు కరువైంది. దీంతో గెలుపుపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.