ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులను విచారిస్తోంది. తాజాగా, ఈడీ టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌కు సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది.
ధావన్ గతంలో ‘1X’ యాప్‌ను ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఇదే కేసులో గతంలో క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ ప్రశ్నించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులపై దర్యాప్తు సంస్థ లోతుగా పరిశీలిస్తోంది. ప్రముఖ బెట్టింగ్ యాప్ అయిన ‘1xBet’ గత ఏడాది డిసెంబర్‌లో సురేష్ రైనాను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే.
ఈడీ ఇటీవల నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన 1xBet, FairPlay, Parimatch, Lotus365 ప్రకటనలపై దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌తో పాటు నటులు సోను సూద్, ఊర్వశి రౌతేలాను కూడా ప్రశ్నించింది.
ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ‘1xbat’, ‘1xbat స్పోర్టింగ్ లైన్స్’ వంటి మారుపేర్లను ఉపయోగించి ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ ప్రకటనలలో తరచుగా QR కోడ్‌లు ఉంటాయి, అవి వినియోగదారులను నేరుగా బెట్టింగ్ వెబ్‌సైట్‌లకు మళ్లిస్తున్నాయని అధికారులు తెలిపారు.