టీమిండియా (Team India) ఓపెనర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శిఖర్ ధావన్ (Shikhar Dhawan) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తన కెరీర్ ముగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, ముఖ్యంగా వన్డేల్లో అద్భుతంగా రాణించారు. తన కెరీర్లో మొత్తం 167 వన్డేలు ఆడి 6793 పరుగులు సాధించిన ‘గబ్బర్’, యువ ఆటగాళ్ల రాకతో జట్టులో తన స్థానం ప్రశ్నార్థకంగా మారిందని అంగీకరించారు.
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో కెరీర్ ముగిసింది!
శుభ్‌మన్ గిల్ (Shubman Gill), ఇషాన్ కిషన్ (Ishan Kishan) వంటి నయా స్టార్లు ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పాటు, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు కూడా రేసులోకి రావడంతో సెలక్టర్లు ధావన్‌ను పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో 2022లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన శిఖర్ ధావన్, రెండేళ్లపాటు పునరాగమనం కోసం ఎదురుచూసి, చివరికి గత సంవత్సరం ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
తాజాగా, ఈ విషయాలపై స్పందించిన శిఖర్ ధావన్, బంగ్లాదేశ్ (Bangladesh)పై ఇషాన్ కిషన్ (Kishan) డబుల్ సెంచరీ (Double Century) చేసినప్పుడే తన కెరీర్ ముగింపు దశకు వచ్చిందని భావించినట్లు తెలిపారు. ఈ మేరకు హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “నేను చాలాసార్లు ఫిఫ్టీలు బాదాను. ఎన్నోసార్లు డెబ్భైలలో అవుటయ్యాను. వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాను. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో వన్డేలో 200 పరుగులు చేశాడో.. అప్పుడే నా కెరీర్ ముగింపునకు వచ్చేసిందని నా మనసు చెప్పింది. నా అంతరాత్మ చెప్పినట్లే జరిగింది. ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను” అని పేర్కొన్నారు.
అయితే, డబుల్ సెంచరీ (Double Century) వీరుడు ఇషాన్ కిషన్ కూడా అనతికాలంలోనే క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో చోటుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు, శుభ్‌మన్ గిల్ మాత్రం నిలకడైన ఆటతో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎదిగారు.
జట్టులో స్థానం కోల్పోయాక ఒక్కరూ మాట్లాడలేదు.. ద్రవిడ్ మాత్రమే!
జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తనను ఒక్కరు కూడా మళ్లీ కాంటాక్టు చేయలేదని ఈ సందర్భంగా ధావన్ చెప్పుకొచ్చారు. “జట్టులో చోటు కోల్పోవడం సాధారణ విషయమే. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాకు ఇది అలవాటు అవుతుంది. అంతేకాదు ఎవరి బిజీలో వాళ్లుంటారు. పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే, ద్రవిడ్ భాయ్ మాత్రం ఆ సమయంలో నాతో మాట్లాడాడు. ఆయన నాకు మెసేజ్ చేశారు” అని ధావన్ తెలిపారు. ప్రస్తుతం శిఖర్ ధావన్ లీగ్ క్రికెట్ ఆడుతున్నారు. నేపాల్ ప్రీమియర్ లీగ్, లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ ఆయన భాగమవుతున్నారు.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్