‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్, నటి షఫాలీ జరివాలా (42) ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను, ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ముంబయి పోలీసులు తాజాగా అప్డేట్ ఇచ్చారు. షఫాలీ మృతికి కారణాలు ఇంకా స్పష్టం కాలేదని పేర్కొనడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల దర్యాప్తు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, “అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన గురించి మాకు సమాచారం అందింది. అంధేరీలోని షఫాలీ నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాం. పోస్ట్మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని కూపర్ హాస్పిటల్కు తరలించాం. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు” అని ముంబయి పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్ను ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసులు కూడా ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంట మనిషి, ఇంట్లో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసును అనుమానాస్పద ఘటనగానే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం షఫాలీ భర్త పరాగ్ త్యాగీ అపార్ట్మెంట్ బయట తన పెంపుడు శునకంతో నడుస్తూ కనిపించారు.
ఆసుపత్రి వర్గాల ప్రకటన
నిన్న రాత్రి షఫాలీ అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త పరాగ్ త్యాగీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ, కుటుంబసభ్యులు దానిని ధ్రువీకరించలేదు. “శుక్రవారం రాత్రి 11.15 గంటలకు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది” అని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
షఫాలీ జరివాలా సినీ ప్రస్థానం
2002లో వచ్చిన ‘కాంటా లగా’ రీమిక్స్ సాంగ్తో యువతరం మదిని దోచుకుని షఫాలీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో అందరూ ఆమెను ‘కాంటా లగా గర్ల్’గా పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సినిమా ‘ముజ్సే షాదీ కరోగి’ చిత్రంలో ఆమె ఒక పాత్రను పోషించారు. అనంతరం షఫాలీ పలు టీవీ రియాలిటీ షోలలో మెరిశారు. హిందీ బిగ్బాస్ 13లో సైతం ఎంట్రీ ఇచ్చారు.
ఆమె తొలుత మ్యుజీషియన్ హర్మీత్ సింగ్ను వివాహం చేసుకున్నారు. కొంతకాలానికే వారు విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని వివాహమాడారు. షఫాలీ మృతిపై పూర్తి వివరాలు తెలియాలంటే పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచి చూడాలి.